Wednesday, August 8, 2007

మన జాతీయ పతాకం


యేమయిపోతోంది ఈ రోజు, మన మూడు రంగుల జెండాకి?
వెలిసిపోతున్న రంగులని తిరిగి అద్దలేమా దానికి?

మన సాంప్రదాయాలకు ఆలవాలంగా
భరత మాత నుదుటి పైన
నిలిపిన సింధూరమే కాషాయం అనుకున్నాను
యెందరో బలైపోయారు అమ్మ కోసం
అమ్మ సౌభాగ్యం అనుకున్నాను

కులమని మతమని మనకదే హితమని
అమ్మ మోమున రక్తతిలకం దిద్దుతుంటే
రంగు మారి కాషాయం ఎరుపు వర్ణం పులుముకుంటుంటే
ఎందరో బలైపోతున్నారు
అమ్మ దౌర్భాగ్యం ఏమిటో తెలుసుకున్నాను


యేమయిపోతోంది ఈ రోజు, మన మూడు రంగుల జెండాకి?
వెలిసిపోతున్న రంగులని తిరిగి అద్దలేమా దానికి?

నాకు తెలిసిన తెలుపు, శాంతి కపోతం వర్ణమే
నాకు తెలిసిన తెలుపు, మన నవ్వులలో పసితనమే
నేనెప్పుడూ అనుకోలేదు అది పాడె మీద గుడ్డని!
నేనిప్పుడే చూస్తున్నా అది నా కంటికి కమ్మిన మబ్బు అని

అమర వీరుల త్యాగలకు మహాత్ముడి నివాళి
ఆ శాంతికి సందేశం ఆ తెలుపు
నేడు మనం చేస్తున్న అరాచకాలకు కాపుగా
నలుపు దాపుకు తోలు కప్పు తెలుపు

యేమయిపోతోంది ఈ రోజు, మన మూడు రంగుల జెండాకి?
వెలిసిపోతున్న రంగులని తిరిగి అద్దలేమా దానికి?

పారే జీవధారల, కురిసే మేఘదారుల
విరబూసిన రంగు పచ్చ
ఎల్లరికీ శుభం కోరే
మన ఇంటి మావిడాకు పచ్చ
పచ్చటి కొమ్మల పైన కోయిలలు కూసాయి
అవే కొమ్మలు ఎండి నేడు రాబందులు చేరాయి
అభివ్రుద్ధి కోసం పరుగులు తీస్తూ
పచ్హదనం చెరపమని ఎక్కడుంది శాస్త్రం?
కన్నీరు తుదుచుకోవటానికి కూడా లేకుండా
అన్నం పెట్టే చేతినే నరికేసి
ముందు తరాలకు వేస్తున్నమా పచ్చని మార్గం?
ఏదీ ఆ సస్యశ్యామల దేశం?
నేను విన్న ఆ దేశం, నేనెప్పుడూ చూడలేదు నేస్తం!


యేమయిపోతోంది ఈ రోజు, మన మూడు రంగుల జెండాకి?
వెలిసిపోతున్న రంగులని తిరిగి అద్దలేమా దానికి?

తెగువ నింపు గుండెల్లో, బాధ వదులు నిన్నల్లో
ఎదురించి చూడు ఒక్కసారి దద్ధరిల్లు గుండెల్లో
ఆత్మస్థైర్యం నింపు చూపుల్లో గెలుపు తీరు నింపు అడుగుల్లో
చెప్పకనే అశోక చక్రం చెప్పలేదా ఇదే మంత్రం

భయం నింపి బ్రతుకుల్లో, వ్యధను పెంచి నవ్వుల్లో
అడుగు తీసి అడుగేస్తే, అవినీతి అసమర్ధత అవస్థలూ
నిగ్గదీసి అడిగితే, అపహాస్యం అవమానం
అడుగడుగునా శోకమే ఆర్తనాదాలే అనునిత్యం
అశోక చక్రం కాదది...అనంత శోక వలయం

యేమయిపోతోంది ఈ రోజు, మన మూడు రంగుల జెండాకి?
వెలిసిపోతున్న రంగులని తిరిగి అద్దలేమా దానికి?

(ఇలా ఉంది ఇప్పుడు మన తీరు)
ఓ సైనికుడి బలిదానం బదులు ఇచ్చి అవమానం
ఓ అమ్మ కడుపు కోతకి బదులు మరి కొన్ని ప్రాణాలు
ఓ మహాత్ముని త్యాగనికి బదులు ఇచ్చి అరాచకం
ఓ త్యాగనికి ఓ నమస్కారం అంతటితో ఇక చాలు!

మనకి చరిత్ర నేర్పింది తిరిగ రాయ కుండా
తిరగేసి రాసుకుని 'ఆహా' 'ఓహో' అని
వ్యామోహమనే మత్తునిద్ర కలల అందం
ఎగిరే జెండా నెరుపు తెలియకుండా కళ్ళకి వేసుకుని బంధం
వదిలెసాం వదిలెసాం
దేశాన్ని గాలికొదిలేసాం....

దేవుడి సౄష్టి అయిన పక్షుల తరువాత...ఆకశానికి అంత అందాన్ని అద్దే ఒకే ఒక మానవ సౄష్టి...దాస్య శౄంఖలాల నుండి విడతానికి మన ఆశయ రూపం...మన అస్తిత్వ ప్రతిబింబం ...'మన తత్వం' ...మన జాతీయ పతాకం.

యేటికి ఒకటీ రెండు సార్లు బయటకి తీసి...ఉతికి..చక్కగా ఇస్త్రీ చేసి...ఓ కర్రకి కట్టి ఎగరేసి..తీసి దాచిపెట్టేసుకుంటే ఒరిగేది ఏమీ లేదు. ఆ రంగుల వెనక కుళ్ళిపోయిన దేహాలూ,కారిపోయిన రుధిరం, కనుమరుగు అయిపోయిన త్యాగాలు ఉన్నయని గుర్తుంచుకొని, దేశానికి ఏదో ఒకటి చేయాలని అందరం అనుకుంటే చాలు...వెలిసిపోయినవి రంగులే...ఆశయాలు కాదని, అమ్మ సంతోషిస్తుంది.

జై హింద్!