Saturday, January 10, 2015

గాలిపాట

వీణ తీగల సయ్యాటల తరంగాల సారధిని
మౌనరాగాల హృదయ మృదంగాల సాధకుడిని
నేను! నేనే వేణుగాయాల ఊరడింపుల చెలికాడిని
నేను! నేనే వాన మువ్వల సవ్వడుల పాటగాడిని

గాలిని!
ఎనజాలని జాలిని!
జీవరాగ పూల వనమాలిని!

గాలిని!
కనలేని జోలని!
నిత్య సత్య అగమ్య సంచారిని!

సుమ సౌరభాల రథాల రహదారిని
నీలి మేఘాల పథాల సంచారిని

గాలిని! వసు శ్వాసకారిని!
గాలిని! మీ అదృశ్య ఆత్మీయ అనుసారిని!

Friday, October 17, 2014

మనసు

ఒక పరి కోరునేకాంతము, మరొక పరి వాంఛించు సంగత్వము
మనసు మనసునెరుగుట మనిషి పాటి కాదు!

ఒక నాడు పలకరింపుల కెదురుచూడు, మరునాడు తలుపు మూసి తనలోనే తానాడు
వింత మానముల మనసు విత్తమెవరు ఎరుగు?

పర్వతముపై నిల్చి పరువాలు వొలికించు, పాతాళమున దాగి పాహియని ప్రార్ధించు
ధీరత్వము చూపి దిక్కులదిరించు, భీరువై భీతిల్లి భయముగొల్పు
చిత్రమే ఈ చిత్త చిత్రలేఖనము!

రేయిపవలు కన్న క్షణము క్షణముకన్నా
ఊపిరాట సలిపే శ్వాస చలనము కన్నా
వేగమీ హృదయ పరివర్తనా ప్రావీణ్యము
వ్యర్ధమే దానినరయ చేయు మథనము

ఊరికే ఓ కంటగని సాగిపో నవ్వుతూ, ఊరడించ చూడకు ఊహకందరాదు
మదిని మదికి వదిలి ముందుకేగు మనిషీ! వెంటపడి వచ్చునదే నీ బాటను, మనసు పరిచి!

Friday, July 5, 2013

గతం గత:

జ్ఙాపకాల ఓడలపై ప్రయాణించే బాటసారీ!
కన్నీటి కెరటాలపై ఎన్న్నాళ్ళీ సవారి?
ఈ క్షణం గతమైపోయే మునుపే మార్చుకో నీ దారి,
ఎదనదుపు చేసుకో...లేదా ఎదురోచ్చెదేంతా ఎడారి!

Tuesday, July 26, 2011

అంతా నాదే!

ఆ క్షణం మొదలు నేను ఎప్పుడూ ఒక్కడినే
ఏడ్చి చెప్పిన నాడు కోరింది అమ్మ వొడినే!
మాట నేర్చేసరికి గారాలు పోయి
ఆటలొచ్చేసరికి మారాలు చేసి
పరుగులొచ్చేసరికి దూరాలు కోరి
నా ప్రపంచం ఆది నేనే ఆఖరు నేనే

గెలుపు నాదేనని ఏనాటికైనా
పరుల నెగ్గనీక ఓ పూటకైనా
కలిసి సాగే వేళ...మెరిసి తారనై
నిలిచిపోవాలని నేను మేరునై
మిగిలిపొయాను నేను ఒంటరినై!

ఈ క్షణం కదులుతున్నాను ఎప్పుడూ ఒక్కడినై
అలిసిపోయిన ఉసురు విసురు నిట్టూర్పునై
వెలసిపోయిన చూపు కోరు ఇంద్రధనస్సునై
ఓడిపోయిన వొడలు సేదతీరే వొడినై!

ఈ క్షణం నా బాధ వేల మహాసాగరాలు
ఈ క్షణం నా నగవు శతకోటి ఉదయాలు
ఈ క్షణం నా ఉనికి అనంతానంత ప్రాణాలు
ఈ క్షణం నా వేగం అప్రతిహత క్రాంతి గమనం!

Friday, February 6, 2009

కలలోయ్ కలలు!

నేనో కలల వ్యాపారి, కలతల కళ్ళ మీదుగా నా దారి
వేదనతో వేసారిన వారి కళ్ళకి చూపిస్తా వెలుగు దారి

చీకటి ఓ కల, వెలుగు మరో కల
పెట్టెస్తే మీ ఇక్కట్లు తాకట్టు
అల్లేస్తా నేనొక అందమైన వల
కాని ఇందులో ఒకటే గుట్టు
విడిపించలేనంత! ఆ తాకట్టు వెల

ఈ భలే మంచి చౌక బేరానికి
బోలెదంత ఉంది గిరాకి
ఆలసించినా ఫర్వాలేదు
సరుకు నిండుకోదు నాది ఏ నాటికి


క్యారు క్యారుల చిన్నారికి చేతికందే చందమామ కల
చీమిడి ముక్కుల పొన్నారికి చిలిపి ఆటల కల
జిహ్వ పోయిన జీవానికి జిలుగు జాబిలి కల
క్రుంగిపోయిన నమ్మకానికి కొత్త వేకువ కల
అలిసిపోయిన ఓర్పుకి వెచ్చని ఊరట కల
వాడిపొయిన వయసులకి విరుల వాకిళ్ళ కల

నష్టపోయేది ఏముంది నేను ఆ బాధకి ఓ కల అరువిచ్చి?
మీ కడగళ్ళకి ఓ చిన్న స్వప్నం బదులిచ్చి!
ఆ కళ్ళలో నవ్వులు ఆ కళ్ళ ఆశలు, ఇవే నా అరువుకి వడ్డీ
పోగేసుకు పోతాను ఓ చిన్న కలను ఒడ్డి!

లాభమే ఎటు పోయినా, వైభవమే ఎటు చూసినా
నేనో కలల వ్యాపారి, కలతల కళ్ళ మీదుగా నా దారి
వేదనతో వేసారిన వారి కళ్ళలో పండిస్తా నవ్వుల వరి!

Thursday, November 20, 2008

నువ్వు చూడలేదు

నేను ఎప్పుడూ నిన్నే చూస్తున్నా
కలలో అయినా కళ్ళతో అయినా
నా చుట్టూ నువ్వే, నా చుట్టూ అన్నీ నువ్వే

గాలికి రెపరెపలాడే తరువు ఆకులు
మోసుకొస్తాయి నీ కురుల గుర్తులు
అలజడి దాస్తూ అలలే చూపించే సాగరం
అల్లరి చేస్తూ అణుకువ దాచే నీకు సరి
జాబిలి అందాల చందం, నీ నవ్వుల వలలా తోస్తోంది
వలలో చిక్కుకున్నా వరంలా అనిపిస్తోంది

కానీ నువ్వు చూడలేదు
వినీల గగనం లాంటి నా హృదయంలో శూన్యం చూసావు
నీ కోసం దాచుకున్న తళుకు మిణుకుల వెలుగు చూడలేదు
విశాల సముద్రం లాంటి నా ఆలోచనలలో, విసిగించే అలలే చూసావు
అలల పరుపు కింద దాగిన కలల లోకం చూడలేదు
మండే సూర్యుని లాంటి నా నైజంలో కాల్చే కోపమే చూసవు
చల్లని జాబిలికి ప్రాణం పొసే చెలిమి చూడలేదు

నువ్వు చూడలేదు, నేను చేప్పలేను
నాకు చెప్పిన గాలి నీకు చెప్పలేదు
నాకు చూపిన అలలు నీకు చూపలేదు
నన్ను చుట్టిన వల నిన్ను చుట్టలేదు
ఎందుకు? ఓ సారి ప్రశ్నించుకో తెలుస్తుంది, నువ్వు చూడలేదని!

Saturday, October 18, 2008

ఏం మిగిలింది?

ఏం మిగిలింది?
కలలని ఆశలు చేసుకుని, అలుపెరుగని పరుగు అందుకొని
కనిపించని గమ్యాల కోసం గమనంలో?
పాదాలు అరిగిపోయాయి
నడిచొచ్చిన గుర్తులు చెరిగిపోయాయి

ఏం మిగిలింది?
చేతలే బాకులు చేసి, చేధించే ఆశ చూసి
ఎవరు రాసిన గీతలో! మార్చుకునే ఆటలో?
రెక్కలు విరిగిపోయాయి
చేతిలో గీతలు ఓటమి రాతలయిపొయాయి

ఏం మిగిలింది?
కళ్ళలో వొత్తులేసుకుని, కలవరిస్తూ వేకువని
రెప్పలార్పకుండా రేయి పవలు వేచిన వేళల్లో?
దీపం కొండెక్కింది
మోయలేని బరువుతో చూపు, చూపు తిప్పేసుకుంది

ఏం మిగిలింది?
ఈ బ్రతుకు యాత్రలో
తెగిపోయిన బంధాలు తెలియదు ఎటు పోయాయో?
మనసు మీటిన భావాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో?
చిన్ని చిన్ని నవ్వులు ఎక్కడ పారేసుకున్నానో?

పరుగు, ఆశల వెంట, అందని ఎండమావుల కోసం
పరుగు, కలల వెంట, కళ్ళు తెరిస్తే కరిగిపొయే కథల కోసం
పరుగు, ఎంత దాచినా దాహం తీరని ధనం కోసం
పరుగు, ఎంత ఎదిగినా ఒదగని అహం కోసం

ఏం మిగిలింది?
సమత మమత నవ్వు పులకరింపు
ప్రేమ స్నేహం తోడు పలకరింపు
అన్నీ, అన్నీ వదిలిపోయాయి
నాలో మిగిలిన ఏ కొన్నో కూడా అంతరించిపోయాయి
మిగలని వాటి గుర్తులు మాత్రం మిగిలిపొయాయి
మరుపు తెలియని నా మనసుకి తోడుగా!