Tuesday, July 26, 2011

అంతా నాదే!

ఆ క్షణం మొదలు నేను ఎప్పుడూ ఒక్కడినే
ఏడ్చి చెప్పిన నాడు కోరింది అమ్మ వొడినే!
మాట నేర్చేసరికి గారాలు పోయి
ఆటలొచ్చేసరికి మారాలు చేసి
పరుగులొచ్చేసరికి దూరాలు కోరి
నా ప్రపంచం ఆది నేనే ఆఖరు నేనే

గెలుపు నాదేనని ఏనాటికైనా
పరుల నెగ్గనీక ఓ పూటకైనా
కలిసి సాగే వేళ...మెరిసి తారనై
నిలిచిపోవాలని నేను మేరునై
మిగిలిపొయాను నేను ఒంటరినై!

ఈ క్షణం కదులుతున్నాను ఎప్పుడూ ఒక్కడినై
అలిసిపోయిన ఉసురు విసురు నిట్టూర్పునై
వెలసిపోయిన చూపు కోరు ఇంద్రధనస్సునై
ఓడిపోయిన వొడలు సేదతీరే వొడినై!

ఈ క్షణం నా బాధ వేల మహాసాగరాలు
ఈ క్షణం నా నగవు శతకోటి ఉదయాలు
ఈ క్షణం నా ఉనికి అనంతానంత ప్రాణాలు
ఈ క్షణం నా వేగం అప్రతిహత క్రాంతి గమనం!