Thursday, January 31, 2008

అసమర్ధుని జీవయాత్ర

కాలంతో అడుగు కలుపలేక, కదలకుండా ఆగలేక
సాగే పాదం సమాజం కోసమేనని
జన స్రవంతిలో కలిసీ కలవకుండా
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

దాటెళ్ళిపోయేవాటిని ఓ కంట చూస్తూ
అంతరించిపోతున్న వాటిని కాపాడుకోలేక
అరవలేక, అరుపుతో గొంతు కలుపలేక
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

కస్టాలు మనుషలకేనని, ఇదంతా మామూలేనని
గెల్వలేక, ఓటమి సహజమని భరిస్తూ
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

అందని భోగాలు పుల్లని ద్రాక్షలని, అందిన పళ్ళే అమృతమయమని
సంతృప్తితో ఆశకి కళ్ళెం వేస్తూ
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

దొరికిందే విధి అని, దొరకనిది మనది కాదని
ఎగిరి అందుకునే సాహసం లేక
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

చిక్కని చుక్కలు చేరని తీరాలని
చేతిలో గీతలు చెరగని రాతలని
చేయి చాచి అందుకోవటం దురాశేనని
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

తనకు లేని అందం, కేవలం ఒక ఆర్భాటమని
మనకు ఉన్న గుణమే, వెలలేని ధనమని
అందానికి మెరుగులద్దే అందాలని వెక్కిరిస్తూ
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

ఒడిదుడుకుల ఒడిలో సాగిపోతూ
బడలికల నీడలో సేదతీరుతూ
సడలికలు లేని నియమాలే గోడలుగా చేసుకుని
బంధాలు బంధించే సంకెళ్ళని
మూసి ఉంచి మనసు ద్వారబంధాలని
కాలగమనం చూడనని మొండికేస్తూ
కాలంతో గమనాన్ని ప్రతిఘటిస్తూ
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

Thursday, January 17, 2008

నా స్నేహితులందరికీ...

తల నిమిరినప్పుడు,కలవరించినప్పుడు
కనులు వెతికినప్పుడు,కల వరించినప్పుడు
శ్వాస చేరినప్పుడు, ఊపిరాడనప్పుడు
మాటలాడినప్పుడు, మూగబోయినప్పుడు
గోల చేసినప్పుడు, గోడు చెప్పినప్పుడు

తిట్టిన నాడు, వెన్ను తట్టిన నాడు
ఉన్న నాడు, లేని నాడు
ఎండనయినా నీడనయినా
వీడలేదు నిమిషమయినా

నేస్తం నువ్వో వరం!