Thursday, November 20, 2008

నువ్వు చూడలేదు

నేను ఎప్పుడూ నిన్నే చూస్తున్నా
కలలో అయినా కళ్ళతో అయినా
నా చుట్టూ నువ్వే, నా చుట్టూ అన్నీ నువ్వే

గాలికి రెపరెపలాడే తరువు ఆకులు
మోసుకొస్తాయి నీ కురుల గుర్తులు
అలజడి దాస్తూ అలలే చూపించే సాగరం
అల్లరి చేస్తూ అణుకువ దాచే నీకు సరి
జాబిలి అందాల చందం, నీ నవ్వుల వలలా తోస్తోంది
వలలో చిక్కుకున్నా వరంలా అనిపిస్తోంది

కానీ నువ్వు చూడలేదు
వినీల గగనం లాంటి నా హృదయంలో శూన్యం చూసావు
నీ కోసం దాచుకున్న తళుకు మిణుకుల వెలుగు చూడలేదు
విశాల సముద్రం లాంటి నా ఆలోచనలలో, విసిగించే అలలే చూసావు
అలల పరుపు కింద దాగిన కలల లోకం చూడలేదు
మండే సూర్యుని లాంటి నా నైజంలో కాల్చే కోపమే చూసవు
చల్లని జాబిలికి ప్రాణం పొసే చెలిమి చూడలేదు

నువ్వు చూడలేదు, నేను చేప్పలేను
నాకు చెప్పిన గాలి నీకు చెప్పలేదు
నాకు చూపిన అలలు నీకు చూపలేదు
నన్ను చుట్టిన వల నిన్ను చుట్టలేదు
ఎందుకు? ఓ సారి ప్రశ్నించుకో తెలుస్తుంది, నువ్వు చూడలేదని!

Saturday, October 18, 2008

ఏం మిగిలింది?

ఏం మిగిలింది?
కలలని ఆశలు చేసుకుని, అలుపెరుగని పరుగు అందుకొని
కనిపించని గమ్యాల కోసం గమనంలో?
పాదాలు అరిగిపోయాయి
నడిచొచ్చిన గుర్తులు చెరిగిపోయాయి

ఏం మిగిలింది?
చేతలే బాకులు చేసి, చేధించే ఆశ చూసి
ఎవరు రాసిన గీతలో! మార్చుకునే ఆటలో?
రెక్కలు విరిగిపోయాయి
చేతిలో గీతలు ఓటమి రాతలయిపొయాయి

ఏం మిగిలింది?
కళ్ళలో వొత్తులేసుకుని, కలవరిస్తూ వేకువని
రెప్పలార్పకుండా రేయి పవలు వేచిన వేళల్లో?
దీపం కొండెక్కింది
మోయలేని బరువుతో చూపు, చూపు తిప్పేసుకుంది

ఏం మిగిలింది?
ఈ బ్రతుకు యాత్రలో
తెగిపోయిన బంధాలు తెలియదు ఎటు పోయాయో?
మనసు మీటిన భావాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో?
చిన్ని చిన్ని నవ్వులు ఎక్కడ పారేసుకున్నానో?

పరుగు, ఆశల వెంట, అందని ఎండమావుల కోసం
పరుగు, కలల వెంట, కళ్ళు తెరిస్తే కరిగిపొయే కథల కోసం
పరుగు, ఎంత దాచినా దాహం తీరని ధనం కోసం
పరుగు, ఎంత ఎదిగినా ఒదగని అహం కోసం

ఏం మిగిలింది?
సమత మమత నవ్వు పులకరింపు
ప్రేమ స్నేహం తోడు పలకరింపు
అన్నీ, అన్నీ వదిలిపోయాయి
నాలో మిగిలిన ఏ కొన్నో కూడా అంతరించిపోయాయి
మిగలని వాటి గుర్తులు మాత్రం మిగిలిపొయాయి
మరుపు తెలియని నా మనసుకి తోడుగా!

Sunday, March 16, 2008

నువ్వు నేను ప్రేమ

నేను వేచి ఉన్నాను
నువ్వు నా పైన కురుస్తావని
నువ్వు నాతో కలుస్తావని

ఎంత తాగినా తీరని దాహం
ఎంత ఆగినా తీరని విరహం
నా ప్రవాహానికి నువ్వే ప్రాణం

నీలాకాశంలో చల్లని నల్ల మబ్బులా నువ్వు
ఏకమవ్వాలని ఆరాటంతో ఉరకలేసే నదిలా నేను

నీ చినుకు చేతులు నన్ను తాకినప్పుడు
నీ నవ్వుల జల్లు కుండపోతగా ఎద తడిపినప్పుడు
దిగంతాలు ధిక్కరించే ధైర్యం
కరుకు బండలు దాటుకు పోయే పరుగు
చేర్చాయి నన్ను ప్రేమ కడలికి
కలిసిపోయాం మనం ప్రేమ సాగర ఒడిలో

మళ్ళీ మేఘంలా నాలోంచి నువ్వు ఎగిసి
నదిలా నేను నీ కోసం వేచి
వానవై తిరిగి నువ్వు నాలో కలిసి
ఈ ప్రేమ విరహం మనం...
ఎన్ని జన్మల నుంచో ఇదే తరహా
ఈ ప్రేమ కథ అదరహా!

ఎంత పంచినా తరగని వరం ప్రేమ
ఎంత తాగినా తగ్గని దాహం ప్రేమ
ఎప్పటికీ మరువని కథ...నువ్వు నేను ప్రేమ

Thursday, January 31, 2008

అసమర్ధుని జీవయాత్ర

కాలంతో అడుగు కలుపలేక, కదలకుండా ఆగలేక
సాగే పాదం సమాజం కోసమేనని
జన స్రవంతిలో కలిసీ కలవకుండా
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

దాటెళ్ళిపోయేవాటిని ఓ కంట చూస్తూ
అంతరించిపోతున్న వాటిని కాపాడుకోలేక
అరవలేక, అరుపుతో గొంతు కలుపలేక
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

కస్టాలు మనుషలకేనని, ఇదంతా మామూలేనని
గెల్వలేక, ఓటమి సహజమని భరిస్తూ
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

అందని భోగాలు పుల్లని ద్రాక్షలని, అందిన పళ్ళే అమృతమయమని
సంతృప్తితో ఆశకి కళ్ళెం వేస్తూ
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

దొరికిందే విధి అని, దొరకనిది మనది కాదని
ఎగిరి అందుకునే సాహసం లేక
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

చిక్కని చుక్కలు చేరని తీరాలని
చేతిలో గీతలు చెరగని రాతలని
చేయి చాచి అందుకోవటం దురాశేనని
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

తనకు లేని అందం, కేవలం ఒక ఆర్భాటమని
మనకు ఉన్న గుణమే, వెలలేని ధనమని
అందానికి మెరుగులద్దే అందాలని వెక్కిరిస్తూ
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

ఒడిదుడుకుల ఒడిలో సాగిపోతూ
బడలికల నీడలో సేదతీరుతూ
సడలికలు లేని నియమాలే గోడలుగా చేసుకుని
బంధాలు బంధించే సంకెళ్ళని
మూసి ఉంచి మనసు ద్వారబంధాలని
కాలగమనం చూడనని మొండికేస్తూ
కాలంతో గమనాన్ని ప్రతిఘటిస్తూ
వహిస్తూ ప్రేక్షక పాత్ర, సాగిందో అసమర్ధుని జీవయాత్ర!

Thursday, January 17, 2008

నా స్నేహితులందరికీ...

తల నిమిరినప్పుడు,కలవరించినప్పుడు
కనులు వెతికినప్పుడు,కల వరించినప్పుడు
శ్వాస చేరినప్పుడు, ఊపిరాడనప్పుడు
మాటలాడినప్పుడు, మూగబోయినప్పుడు
గోల చేసినప్పుడు, గోడు చెప్పినప్పుడు

తిట్టిన నాడు, వెన్ను తట్టిన నాడు
ఉన్న నాడు, లేని నాడు
ఎండనయినా నీడనయినా
వీడలేదు నిమిషమయినా

నేస్తం నువ్వో వరం!