నేను ఎప్పుడూ నిన్నే చూస్తున్నా
కలలో అయినా కళ్ళతో అయినా
నా చుట్టూ నువ్వే, నా చుట్టూ అన్నీ నువ్వే
గాలికి రెపరెపలాడే తరువు ఆకులు
మోసుకొస్తాయి నీ కురుల గుర్తులు
అలజడి దాస్తూ అలలే చూపించే సాగరం
అల్లరి చేస్తూ అణుకువ దాచే నీకు సరి
జాబిలి అందాల చందం, నీ నవ్వుల వలలా తోస్తోంది
వలలో చిక్కుకున్నా వరంలా అనిపిస్తోంది
కానీ నువ్వు చూడలేదు
వినీల గగనం లాంటి నా హృదయంలో శూన్యం చూసావు
నీ కోసం దాచుకున్న తళుకు మిణుకుల వెలుగు చూడలేదు
విశాల సముద్రం లాంటి నా ఆలోచనలలో, విసిగించే అలలే చూసావు
అలల పరుపు కింద దాగిన కలల లోకం చూడలేదు
మండే సూర్యుని లాంటి నా నైజంలో కాల్చే కోపమే చూసవు
చల్లని జాబిలికి ప్రాణం పొసే చెలిమి చూడలేదు
నువ్వు చూడలేదు, నేను చేప్పలేను
నాకు చెప్పిన గాలి నీకు చెప్పలేదు
నాకు చూపిన అలలు నీకు చూపలేదు
నన్ను చుట్టిన వల నిన్ను చుట్టలేదు
ఎందుకు? ఓ సారి ప్రశ్నించుకో తెలుస్తుంది, నువ్వు చూడలేదని!
Thursday, November 20, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment