ఏం మిగిలింది?
కలలని ఆశలు చేసుకుని, అలుపెరుగని పరుగు అందుకొని
కనిపించని గమ్యాల కోసం గమనంలో?
పాదాలు అరిగిపోయాయి
నడిచొచ్చిన గుర్తులు చెరిగిపోయాయి
ఏం మిగిలింది?
చేతలే బాకులు చేసి, చేధించే ఆశ చూసి
ఎవరు రాసిన గీతలో! మార్చుకునే ఆటలో?
రెక్కలు విరిగిపోయాయి
చేతిలో గీతలు ఓటమి రాతలయిపొయాయి
ఏం మిగిలింది?
కళ్ళలో వొత్తులేసుకుని, కలవరిస్తూ వేకువని
రెప్పలార్పకుండా రేయి పవలు వేచిన వేళల్లో?
దీపం కొండెక్కింది
మోయలేని బరువుతో చూపు, చూపు తిప్పేసుకుంది
ఏం మిగిలింది?
ఈ బ్రతుకు యాత్రలో
తెగిపోయిన బంధాలు తెలియదు ఎటు పోయాయో?
మనసు మీటిన భావాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో?
చిన్ని చిన్ని నవ్వులు ఎక్కడ పారేసుకున్నానో?
పరుగు, ఆశల వెంట, అందని ఎండమావుల కోసం
పరుగు, కలల వెంట, కళ్ళు తెరిస్తే కరిగిపొయే కథల కోసం
పరుగు, ఎంత దాచినా దాహం తీరని ధనం కోసం
పరుగు, ఎంత ఎదిగినా ఒదగని అహం కోసం
ఏం మిగిలింది?
సమత మమత నవ్వు పులకరింపు
ప్రేమ స్నేహం తోడు పలకరింపు
అన్నీ, అన్నీ వదిలిపోయాయి
నాలో మిగిలిన ఏ కొన్నో కూడా అంతరించిపోయాయి
మిగలని వాటి గుర్తులు మాత్రం మిగిలిపొయాయి
మరుపు తెలియని నా మనసుకి తోడుగా!
Saturday, October 18, 2008
Subscribe to:
Posts (Atom)