Friday, February 6, 2009

కలలోయ్ కలలు!

నేనో కలల వ్యాపారి, కలతల కళ్ళ మీదుగా నా దారి
వేదనతో వేసారిన వారి కళ్ళకి చూపిస్తా వెలుగు దారి

చీకటి ఓ కల, వెలుగు మరో కల
పెట్టెస్తే మీ ఇక్కట్లు తాకట్టు
అల్లేస్తా నేనొక అందమైన వల
కాని ఇందులో ఒకటే గుట్టు
విడిపించలేనంత! ఆ తాకట్టు వెల

ఈ భలే మంచి చౌక బేరానికి
బోలెదంత ఉంది గిరాకి
ఆలసించినా ఫర్వాలేదు
సరుకు నిండుకోదు నాది ఏ నాటికి


క్యారు క్యారుల చిన్నారికి చేతికందే చందమామ కల
చీమిడి ముక్కుల పొన్నారికి చిలిపి ఆటల కల
జిహ్వ పోయిన జీవానికి జిలుగు జాబిలి కల
క్రుంగిపోయిన నమ్మకానికి కొత్త వేకువ కల
అలిసిపోయిన ఓర్పుకి వెచ్చని ఊరట కల
వాడిపొయిన వయసులకి విరుల వాకిళ్ళ కల

నష్టపోయేది ఏముంది నేను ఆ బాధకి ఓ కల అరువిచ్చి?
మీ కడగళ్ళకి ఓ చిన్న స్వప్నం బదులిచ్చి!
ఆ కళ్ళలో నవ్వులు ఆ కళ్ళ ఆశలు, ఇవే నా అరువుకి వడ్డీ
పోగేసుకు పోతాను ఓ చిన్న కలను ఒడ్డి!

లాభమే ఎటు పోయినా, వైభవమే ఎటు చూసినా
నేనో కలల వ్యాపారి, కలతల కళ్ళ మీదుగా నా దారి
వేదనతో వేసారిన వారి కళ్ళలో పండిస్తా నవ్వుల వరి!